నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల, వరదల సందర్భంగా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు.కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి శ్రీ ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ బృందానికి ఈ రోజు ఉదయం బిఆర్ కెఆర్ భవన్ లో రాష్ట్రంలో వరదల పరిస్ధితి, నష్టం, చేపడుతున్న సహాయక చర్యల పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, వర్షాల వలన జరిగిన నష్టంపై ఛాయ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.ఇరిగేషన్, మున్సిపల్ శాఖ, ఆర్అండ్ బి, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డ్, వ్యవసాయం, ఇంధన, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర బృందం సభ్యులతో సమావేశమై రాష్ట్రంలో జరిగిన నష్టాలపై సవివరంగా తెలియజేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో అత్యధిక వర్షాలవలన హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలియజేశారు.
మూసీ నదికి వరదముంపు ఏర్పడటంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడటం వలన నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో మౌళిక వసతులు భారీగా నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక అంచనాను రూపొందించిందని తెలియజేశారు. పంట నష్టం రూ. 8633 కోట్లుగా, రహదారులకు రూ. 222 కోట్లు, జిహెచ్ఎంసి కి సుమారు రూ.567 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు పెర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయం క్రింద తక్షణం రూ.550 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రెండు లక్షల మందికి ఆహార పొట్లాలను అందచేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 లక్షల క్లోరిన్ ట్యాబ్లేట్లు తో పాటు బ్లీచింగ్ పౌడర్ ను సరఫరా చేశారు. వరద ముంపుకు గురైన 15 సబ్ స్టేషన్ లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి సరఫరాను పునరుద్దరించామన్నారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ జనార్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ లోకేష్ కుమార్, వాటర్ బోర్డు యండి శ్రీ దానకిషోర్, టిఎస్ఎస్ పిడిసిఎల్ సి.యండి శ్రీ రఘుమారెడ్డి మరియు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.