స్వదేశంలో పులిలా గర్జించారు. కానీ విదేశీ గడ్డపై మాత్రం తోకముడిచారు. దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు టెస్టుల ఓటమితో టీమిండియాపై ఎన్నో విమర్శలు..ముఖ్యంగా విరాట్ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. విరాట్ టెస్టు కెప్టెన్సీకి పనికిరాడని దుయ్యబట్టారు. ఇంకొంతమంది మళ్లీ ధోనిని కెప్టెన్ చేయాలని కామెంట్లు కూడా చేశారు. కానీ వాటన్నింటికి విరాట్ ఒక్క మ్యాచ్‌తో సమాధానం చెప్పాడు. తనలోని నాయకత్వ ప్రతిభను విమర్శకులకు రుచి చూపించాడు. నాడు కోహ్లిని తిట్టినవారే నేడు మెచ్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చేలా చేశాడు చికూ.
మూడో టెస్టులో సఫారీలను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించిన కోహ్లిపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తతున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లెర్ వెసెల్స్ ..కోహ్లిపై పొగడ్తల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరించే స్టైల్‌లో ఎవరైనా తప్పులు వెతికే పని చేస్తే మాత్రం చివరకు నిరాశ తప్పదంటూ తెలిపాడు.
భారత జట్టును నడిపించే విధానంలో కోహ్లిని వేలెత్తిచూపలేరు అని వెసెల్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లినే బెస్ట్. అందులో ఎటువంటి సందేహం లేదు. సహచర ఆటగాళ్లపై నమ్మకాన్ని ఉంచుతూ గెలుపు కోసం కృషి చేసే కెప్టెన్ కోహ్లి. విరాట్‌ను బ్యాటింగ్ పరంగా చూసినా, నాయకుడిగా చూసినా గెలుపే అతని లక్ష్యం. ఆ క్రమంలోనే ఫీల్డ్‌లో అతను దూకుడుగా ఉంటాడు. ఆ దూకుడు కొన్ని సందర్బాల్లో మంచి చేస్తే, కొన్నిసార్లు విఫలం కూడా కావొచ్చన్నాడు.