క్యాన్సర్ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి?

1
- Advertisement -

క్యాన్సర్ పరీక్షలు ఎవరెప్పుడు చేయించుకోవాలి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. మహిళలు 40 ఏళ్ల వయసు నుంచి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలు 21 ఏళ్ల వయసు నుంచి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషులు 45-50 ఏళ్ల మధ్య ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) పరీక్షను ఏడాదికి ఒకసారి చేయించుకోవచ్చని చెబుతున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరూ 50 ఏళ్ల వయసు నుంచి పదేళ్లకు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ (HPV) టీకా కీలక పాత్ర పోషిస్తుంది. 9-14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

2026 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల బాలికల కోసం జాతీయ హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రుల అనుమతితో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఒక డోసు టీకా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 1.2 కోట్ల మంది బాలికలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తారని అంచనా. 2026 సెప్టెంబర్ 11 నాటికి 80 లక్షలకు పైగా టీకా డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ పరీక్షలు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. రెండో, మూడో శ్రేణి నగరాల్లో అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిపై ప్రజలకు తగిన అవగాహన ఉండటం లేదు.

Also Read:ఓనర్ ఫోటోతో ఫేక్ మెసేజ్..రూ.కోటి స్వాహా!

గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక వైద్య సేవల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు, చికిత్స వ్యయం, పరీక్షల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో 19 స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్లు, 20 టెర్షియరీ కేర్ క్యాన్సర్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025-26 బడ్జెట్‌లో భాగంగా మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 2025-26లో 200 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మొత్తంగా దేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. తద్వారా మరణాల సంఖ్యను తగ్గించడంతోపాటు రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చు.

- Advertisement -