కెనడాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ పండుగ జరిపారు. కెనాడాలోని టోరంటో నగరంలో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఈ నెల 24న ఉత్సాహభరిత వాతావరణంలో బతుకమ్మ పండుగను చేసుకున్నారు. బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ ఆడబిడ్డలతో గొంతుకలిపారు. ఈ వేడుక అచ్చం తెలంగాణ పల్లెను గుర్తు చేసింది. ఈ బతుకమ్మ వేడుకలను 500 మంది హాజరు అయ్యారు.
ఆట, మాట, పాట అన్నిటా పూర్తి తెలంగాణ సాంప్రదాయ రీతిలో జరుపుకున్న ఈ పండుగ విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్లను తమ సంస్కృతిని నిలబెట్టుకోవడంలో ఎంతగా పాటు పడుతున్నారు అనే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది.
సహజంగా చలి దేశమైన కెనడాలో వాతావరణం అనుకూలంగా లేకపోయినా , వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అనేక మంది తెలంగాణ మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటలను కూడా పెట్టారు. పెద్ద వాళ్లు తెలంగాణ సంస్కృతిల బతుకమ్మ పండుగ యొక్క గొప్పదనాన్ని పిల్లలకు తెలిపారు.
తరువాత రకరకాల సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.
కార్యక్రమం చివర్లో టీడీఎఫ్ కెనడా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతూనే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్యక్రమాలను చేస్తూ ఉంటామని వారు ఈ సందర్భంగా తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖతో అనుసంధానమయ్యి ఈ కార్యక్రమం నిర్వహించబడింది.