సింగిరెడ్డి నారాయణరెడ్డి ఇక లేరన్న వార్తను… సినీ ప్రేక్షక లోకం జీర్ణించుకోలేకపోతుంది. ఆయన రాసిన ఎన్నో సినిమా పాటలు తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాయి. 1962లో వచ్చిన ఆత్మబంధువులో ‘చదువురాని వాడవని దిగులు చెందకు’ ‘గులేబకావళి కథ’లో ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ… అంటూ ఆయన రాసిన తొలి సినీ గీతాలు.. ఇప్పటికీ మరువలేనివి. కొన్ని వందల చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ‘రాముడు భీముడు’లో తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే…, ‘మంగమ్మ శపథం’లో కనులీవేళ చిలిపిగ నవ్వెను, ‘బంగారు గాజులు’లో అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, ‘ధర్మదాత’లో ఓ నాన్నా నీ మనసే వెన్న,’ లక్ష్మీ కటాక్షం’లో రా వెన్నెల దొరా కన్నియను చేరా… వంటి పాటలు కొన్ని మచ్చుతునకలు.
1984లో వచ్చిన మంగమ్మగారి మనవడులో శ్రీ సూర్యనారాయణా మేలుకో, 1985లో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యంలో లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల లాలి ,1989లో వచ్చిన సూత్రధారులు సినిమాలో జోలా జోలమ్మ జోల నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల… లాంటి పాటలు ఎక్కడో దగ్గర ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ’20వ శతాబ్దం’లో అమ్మను మించి దైవమున్నదా?, ‘ఒసే రాములమ్మా’లో ఓ ముత్యాల కొమ్మా.. ఓ రాములమ్మా, ‘ప్రేమించు’లో కంటేనే అమ్మ అని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా,’ సీతయ్య’లో ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ, ‘అరుంధతి’లో జేజమ్మా జేజమ్మా… వంటి ఎన్నో పాటలను ఆయన కలం అందించింది. 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం సినారేకు దక్కింది. ‘సీతయ్య’ చిత్రంలో ఇదిగో రాయలసీమ గడ్డ… అంటూ ఆయన రాసిన పాటకు నంది అవార్డు లభించింది.
దివంగత ఎన్టీఆర్ తో పరిచయం ఆయన్ను సినీ రంగంలో నిలదొక్కుకునేలా చేయగా, తన అపారమైన విజ్ఞానంతో ఎంతో కీర్తిని అందుకున్నారు. అంతేకాదు సీనారే గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ,మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూభాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్,రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్,సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా,ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లోయుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.