కుప్పకూలిన ఆరంతస్తుల మేడ

277
building collapses in city
- Advertisement -

హైదరాబాద్ నానక్ రామగూడలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఆరంతస్తుల భవనం….పేక మేడలా కూలిపోయింది.నిర్మాణ పనుల కోసం వచ్చిన ఆరు కుటుంబాలు ఈ భవంతిలోనే నివాసం ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు.

నానక్‌రాంగూడలో భవనం కూలిపోయిన చోట పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రెండు పొక్లెయిన్‌లతో శిథిలాలను తొలగిస్తున్నారు. మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను చేపట్టాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ పోలీస్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శిథిలాల తొలగింపు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, సహాయచర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్‌బలగాలను ఉపయోగించుకోవాలని సూచించారు. బాధితులను ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయచర్యలు ముమ్మరం చేసి ప్రాణనష్టాన్ని నివారించాలని సూచించారు.

building collapses in city

ఆరు నెలల కిందట భవన నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. గురువారం పెయింటింగ్‌ వర్క్‌ చేసినట్లు సమాచారముంది. సహాయక చర్యల్లో రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్‌ పోలీసులు, ఎస్‌వోటీ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు పలువురు కార్పొరేటర్లు పరిశీలించారు. ప్రమాదానికి కారకులైన వారికి వదిలిపెట్టబోమని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.

టోలిచౌకి సూర్యానగర్‌కు చెందిన సత్తుసింగ్‌ అనే వ్యక్తి నానక్‌రామగూడలో 220 గజాల స్థలాన్ని కొని ఎలాంటి అనుమతులు లేకుండానే జీ ప్లస్‌ ఆరు అంతస్తుల నిర్మాణాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలుపెట్టారు. కనీస ప్రమాణాలు, ప్రణాళిక లేకుండానే ఈ భవన నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసేశారు. అద్దెకు ఇవ్వడానికి వీలుగా ఇందులో కొన్ని సింగిల్‌, కొన్ని డబుల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లు నిర్మించారని తెలిసింది. ఇప్పటికే మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయిందని, మిగిలిన అంతస్తుల్లో టైల్స్‌ పని జరుగుతోందని స్థానికులు తెలిపారు.

building collapses in city

గురువారం రాత్రి 9.20 సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో భవంతి కుప్పకూలిపోయింది. కూలీలు, మేస్త్రీల కుటుంబాలు ఈ భవనంలోనే నివాసం ఉంటున్నాయి. అన్ని అంతస్తులు ఒకదానిపై ఒకటి పడడంతో శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెంటనే బయటకు తీసేందుకు వీల్లేకుండా పోయింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దనరెడ్డి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను, అగ్నిమాపక అధికారులను పంపించారు. బేస్‌మెంట్‌, పిల్లర్లు కూడా సరిగా నిర్మించలేదని, ఇనుము, సిమెంట్‌ కూడా పూర్తిస్థాయిలో వాడకుండానే భవంతి నిర్మించడం పోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

భూమిలోపల మూడంతస్తులు పార్కింగ్‌ కోసం నిర్మిస్తున్నారు. ఇప్పటికే భూమి లోపల ఒక అంతస్తు నిర్మాణానికి పిల్లర్లు కూడా వేశారు. కూలిన భవనం పక్కనే భూమి లోపలకు అతి లోతుగా తవ్వడం, కుప్పకూలిన భవన నిర్మాణంలో నాణ్యత లేకపోవడం ఈ ప్రమాదానికి మరో కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

building collapses in city

కేవలం 220 గజాల్లో జీ ప్లస్‌ ఆరంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని జీహెచ్‌ఎంసీకి పలుమార్లు ఫిర్యాదు చేశానని ఈ భవనం పక్కనే ఉన్న మరో భవన యజమాని వీరేందర్‌సింగ్‌ చెబుతున్నారు. చర్యలు తీసుకోవాలని బల్దియా అధికారులను కోరినా పట్టించుకోలేదని చెప్పారు. అధికారుల అండదండలతోనే ఈ భవనాన్ని ఇష్టారాజ్యంగా నిర్మించేశారని స్థానికులు తెలిపారు. సత్తుసింగ్‌కు నానక్‌రాంగూడలో మరో ఇల్లు కూడా ఉందని, నానక్‌రాంగూడలో పదుల సంఖ్యలో ఇళ్లు జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండానే నిర్మించారని ఇక్కడివారు చెబుతున్నారు.

- Advertisement -