నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

173
telangana assembly budget
- Advertisement -

ఈరోజు నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18న ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం జరిగే బీఏసీలో సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యులతో సహా అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌, మీడియా ప్రతినిధులకు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ ఆవరణను రెండుసార్లు శానిటైజేషన్‌ చేస్తారు. భద్రతా ఏర్పాట్లపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలతోపాటు గత సమావేశాల్లో జీరోఅవర్‌లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అందజేయాలని స్పీకర్‌ ఆదేశించారు.

అయితే.. ఈ బడ్జెట్‌ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని సమాచారం అందుతోంది. బడ్జెట్ సంబంధ అంశాలను అధ్యయనం చేసుకోడానికి సభకు 19వ తేదీన సెలవు ఉంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన పద్దులపై విస్తృత చర్చ జరగనుంది. మరోవైపు అసెంబ్లీలో ఈసారి కొత్త సభ్యులు కనిపించనున్నారు. శాసనసభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెడుతున్నారు. శాసనమండలిలోకి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన కవిత, గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు అడుగు పెట్టనున్నారు.

- Advertisement -