సెస్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి…

87
- Advertisement -

తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలో సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. దీంతో సెస్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. సెస్‌ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నో అడ్డదారులు తొక్కిందని అన్నారు. అయితే బీజేపీని ప్రజలు తిప్పి కొట్టారని, తమ ఓటు ద్వారా బీజేపీకి బుద్ది చెప్పారని కేటీఆర్‌ అన్నారు.

సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు వెద‌జ‌ల్లిందని, సాధారణ ఎన్నికల మాదిరి విచ్చలవిడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కిందని, అనేక ప్రలోభాలకు తెరలేపింద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బీజేపీ పట్ల నెలకొని ఉన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కార భావానికి నిదర్శనమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక ఎన్నికల్లో బీజేపీని తిరస్కరిస్తూ వస్తున్నారని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం పైన తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనం అన్నారు. తమ ప్రభుత్వం రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులకు, కుల వృత్తులకు అందిస్తున్న విద్యుత్ సంక్షేమ కార్యక్రమాలకు వారిచ్చిన జనామోదం అని కేటీఆర్ పేర్కొన్నారు.

భారీగా మౌలిక వసతుల కల్పన, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న తమ విధానాలను ప్రజలు బలపరిచారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -