భారత రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో భేటీ అయిన ఆయన, దేశ రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లపై తీర్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నిర్వీర్యమవుతాయని ఆయన హెచ్చరించారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం 24% ఎంపీ సీట్లు ఉన్నాయి.
డీలిమిటేషన్ తర్వాత ఈ శాతం తగ్గకూడదని, ఎంపీ సీట్ల సంఖ్యను 50% పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే, జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
డీలిమిటేషన్ బిల్లులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించిన తర్వాతే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పటివరకు తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేయవద్దని నేతలకు సూచించారు. దక్షిణాది ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదే భేటీలో రాబోయే పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది.
Also Read:ఎంతసేపు స్క్రీన్ చూస్తే ప్రమాదమో తెలుసా?

