తెలంగాణ శాసనసభ వద్ద మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రజాప్రతినిధులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ని ఆశ్రయించారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయా భారతి సయానిని కలిసి అధికారికంగా ఫిర్యాదు లేఖను అందజేశారు.
ఇటీవల అసెంబ్లీ ప్రాంగణం వద్ద జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసులు తమ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు పట్నం సబితా ఇంద్రా రెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యురాలికి ప్రత్యక్షంగా వివరించారు.
శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి వెళ్తున్న తమను నిరోధించడమే కాకుండా, పోలీసుల చేత అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
Also Read:KTR:కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కనీస గౌరవం లేకుండా పోలీసులు ప్రవర్తించిన తీరుపై స్వతంత్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శాసనసభ్యుల ప్రాథమిక మరియు రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలకు కనీస భద్రత మరియు గౌరవం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

