ఒలింపిక్స్ పట్ల యువతలో మరింత క్రేజ్ తీసుకువచ్చే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బ్రేక్ డ్యాన్స్ కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం కల్పించారు. బ్రేక్ డ్యాన్స్ ను ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. 2024లో పారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడల ద్వారా బ్రేక్ డ్యాన్స్ అరంగేట్రం చేయనుంది. ఈ బ్రేక్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేగవంతమైన శరీర కదలికలతో చేసే నృత్యమే బ్రేక్ డ్యాన్స్. పాశ్చాత్యదేశాల్లో మొదలైన ఈ డ్యాన్సింగ్ స్టయిల్ ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు ఒలింపిక్ క్రీడల్లో ఒకటిగా ప్రవేశపెట్టనున్నారు.
కాగా, దీనితో పాటు 2024లో జరిగే ఈవెంట్‌లో స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ మరో మూడు క్రీడలు కూడా ఉండనున్నట్లు ఐఓసీ తెలిపింది. అయితే ఈ మూడూ ఆటలు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ నుంచే ప్రారంభమవుతాయి. నిజానికి ఈ ఒలింపిక్స్ ఈ సంవత్సరం జరగాల్సి ఉన్నా కరోనా వల్ల 2021 జులై 23కి వాయిదాపడ్డాయి. ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు 2024లో ఏయే స్పోర్ట్స్ ఉంటాయో ఇప్పుడే చెప్పమని కోరారు. తద్వారా తాము అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దాంతో… 2021తోపాటూ… 2024లో ఉండబోయే కొత్త ఆటల గురించి ఐఓసీ ఇప్పుడే చెప్పేసింది.