కొవాగ్జిన్‌కు బ్రెజిల్ అనుమతి..

85
Covaxin

గతంలో సరైన తయారీ ప్రమాణాలు (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్-జీఎంపీ) పాటించలేదంటూ ఇంతకుముందు కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వని బ్రెజిల్ తాజాగా పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కు క్రమంగా పలు దేశాలు అనుమతి ఇస్తున్నాయి. ఇటీవలే 40 లక్షల డోసుల కొవాగ్జిన్‌ను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ (అన్విసా) అనుమతి నిచ్చింది.

తాజాగా, కొవాగ్జిన్ సరైన నాణ్యతా ప్రమాణాలతో తయారైన వ్యాక్సిన్ అంటూ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ ‘అన్విసా’ జీఎంపీ అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్ ప్రధాన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌కు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఉపయోగించే ఫార్మా ముడి పదార్థానికి బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ ఈ మేరకు ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. తాజా అనుమతులతో భారత్ నుంచి బ్రెజిల్‌కు కొవాగ్జిన్ ఎగుమతులకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. అన్విసా జారీ చేసిన అనుమతులు రెండేళ్ల పాటు అమలులో ఉంటాయి.