నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ
చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు. అందుకే వందరోజుల వేడుకను కర్నూలులో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. అఖండ వంద రోజుల కృతజ్ఞత సభ శనివారం రాత్రి కర్నూలు నగరంలోని ఎస్‌టి.బి.సి. కాలేజ్ లో ఘనంగా జరిగింది. ఆనందోత్సాహాలతో కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోనీ, విజయవాడ, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చిన్నపిల్లల నుంచి మహిళలు, పెద్దలు సైతం జైబాలయ్య
అంటూ నినదించారు.
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, నేను తులసి సినిమా చేశాక నాకు మూడో సినిమా ఓకే అయింది. ఎదురుగా బాలయ్య వున్నారు. ఆయనకు 90 సినిమాల హిస్టరీ వుంది. ఆయన పౌరాణికం, జానపదం, ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు చేసేశారు. ఇప్పుడు ఏం చేసి ఫ్యాన్స్ దగ్గరకు ఎలా రావాలనే ఆలోచనలోంచి 2009లో సింహా మొదటి అడుగువేశాం. అలా 2014లో లెజెండ్‌తో రెండో అడుగు. 2021 అఖండతో మూడో అడుగు. మాది 13 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం. మా ప్రతి సినిమా ప్రయోగమే. అభిమానులే మా సినిమాలను ఆదరించి అద్భుతమైన విజయాలుగా మలిచారు. మీ కుటుంబ సభ్యుడిగా భావించారు. బాలయ్య బలం మీరే. చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా మీరే. ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్యబాబు గొప్ప వ్యక్తి. నా సుధీర్ష ప్రయాణంలో సహకరించిన నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అఖండను బాలయ్య అభిమానులతోపాటు ఇతర హీరోల అభిమానులు కూడా చాలా నిజాయితీగా అఖండ విజయాన్ని చేకూర్చారు.
సామాన్యుల నుండి పండితులు, పిల్లలనుంచి పెద్దలు అందరూ ఈ సినిమాను మని సినిమాగా భావించారు. మాస్ కమర్షియల్ సినిమాలో ప్రకృతి,దైవం, ధర్మం గురించి చెప్పడం చాలా అరుదు. అందుకు అవకాశం కల్పించిన భగవంతుడికి తలవంచి నమస్కరిస్తున్నా.మాస్ కమర్షియల్ సినిమా ఏదైనా టెస్ట్ చెయ్యాలంటే ప్లే గ్రౌండ్ రాయలసీమే. రాయలసీమ మెచ్చితే ప్రపంచమే మెచ్చుతుంది. అందుకే ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. అందుకే బాలయ్య కూడా ఇక్కడే చేయాలని అన్నారు. ముచ్చింతల్‌లో షూటింగ్‌లో బిజీగా వున్నా ఆపేసి మీకోసం ఇక్కడకు వచ్చారు. బాలయ్య పురాణ పురుషుడు. నటనలో నందమూరి తారక రామారావు వారసుడే కాకుండా సేవా కార్యక్రమంలోనూ ఆయన పుణికిపుచ్చుకున్నాడు. అఘోరా పాత్రకు చాలా ప్రిపరేషన్ చేశారు. బాలయ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ, బోయపాటిని నన్ను ఆ దేవుడే కలిపాడు అన్నారు. అందుకే మా జర్నీ ఇలాగే వుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మీ అభిమానుల అభిమానం కూడా ఇలాగే వుండాలని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకుల అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని బోయపాటి తెలిపారు.