రక్షణ స్థావరం సమీపంలో భారీ బిల్డింగ్!

10
- Advertisement -

ముంబైలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న అత్యంత సున్నితమైన నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ శిక్రా సమీపంలో నిర్మితమవుతున్న ఓ హై-రైజ్ భవనంపై బాంబే హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఐఎన్‌ఎస్ శిక్రా కమాండింగ్ అధికారి కోర్టును ఆశ్రయిస్తూ, రక్షణ స్థావరానికి కేవలం 246 మీటర్ల దూరంలో ‘జాధవ్‌జీ మాన్షన్’ పేరుతో అక్రమంగా, అనుమతి లేకుండా భవనం నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు.

జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఫిబ్రవరి 16 అర్ధరాత్రి నుంచి ఫిబ్రవరి 18 వరకు భవన ప్రాంగణంలో ఎవరూ ప్రవేశించరాదని ఆదేశించింది. ఈ వ్యవధిలో నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్ శిక్రాలో ల్యాండ్ అవ్వాల్సి ఉండటంతో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయని కోర్టు గమనించింది.

పిటిషన్‌లో, నౌకాదళం నుంచి తప్పనిసరి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందకుండా అనుమతులు మంజూరు చేశారని పేర్కొన్నారు. 2011 తర్వాత భవన ప్లాన్లలో చేసిన మార్పులతో ఎత్తు, అంతస్తుల సంఖ్య పెరిగి, నౌకాదళ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యక్ష దృశ్యరేఖ (లైన్ ఆఫ్ సైట్) ఏర్పడిందని వాదించారు.

Also Read:కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!

బీఎంసీ తన చట్టబద్ధ అధికారాలను వినియోగించలేదని కూడా ఆరోపించారు. ఈ నిర్మాణం జాతీయ భద్రతకు ముప్పుగా ఉందని పేర్కొంటూ, భవనాన్ని కూల్చివేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసును ఫిబ్రవరి 18న మళ్లీ విచారించనుంది.

- Advertisement -