సోషల్ మీడియా పుకార్లను నమ్మకండి!

6
- Advertisement -

హైదరాబాద్‌లో పిల్లలను అపహరించేందుకు ఓ మహిళ ప్రలోభాలకు గురిచేస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాన్ని పోలీసులు పూర్తిగా ఖండించారు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్పందిస్తూ…ఇలాంటి ఘటనలు ఎక్కడా నమోదు కాలేదు. అలాంటి గ్యాంగ్‌లు ఉన్నాయనే సమాచారం కూడా లేదు. నిర్ధారించని సందేశాలను నమ్మకండి, ఫార్వర్డ్ చేయకండి. వదంతుల ఆధారంగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి అని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

సోషల్ మీడియాలో ‘చైల్డ్ సేఫ్టీ అలర్ట్’, ‘వాంటెడ్’ నోటీసు పేరుతో ఓ మహిళ ఫోటో ప్రచారంలోకి వచ్చింది. ఆ మహిళ పిల్లలకు చాక్లెట్లు చూపించి ప్రలోభపెడుతోందని ప్రచారం జరిగింది. అయితే పోలీసులు దీనిని ఫేక్ న్యూస్‌గా పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. “ఆధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ముందుగా ఆలోచించండి, నిజమో కాదో నిర్ధారించండి, బాధ్యతగా వ్యవహరించండి,” అని కమిషనర్ పేర్కొన్నారు.

ఇక మరో పోస్టులో దేవాలయం ముందు డ్రగ్స్ చూపిస్తూ రీల్ చేసిన యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “మహాశివరాత్రి పవిత్ర వేడుక. ఈ సందర్భంలో డ్రగ్స్ ప్రదర్శించడం తీవ్రమైన నేరం. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు అయితే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది,” అని తెలిపారు. యువత సోషల్ మీడియా లైక్స్ కోసం భవిష్యత్తును పణంగా పెట్టవద్దని హెచ్చరించారు.

Also Read:కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!

- Advertisement -