ప్రముఖ బాలీవుడ్ హీరో, సంజయ్ దత్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సంజయ్ దత్ అక్రమంగా ఆయుధాలను కలిగివున్న కేసులో జైలు శిక్షను కూడా అనుభవించాడు. అయితే సంజయ్ దత్ మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని తెలుస్తోంది. వచ్చే నెల 25న సంజయ్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్ఎస్పీ)లో చేరనున్నట్లు ఆ పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షులు మంత్రి మహదేవ్ జంకర్ వెల్లడించారు.
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ఎస్పీ కూడా భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా 2009లో లక్నో లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా నిలబడిన సంజయ్ దత్, ఆపై దోషిగా తేలడంతో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
2019 ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్న ఆయన, తదుపరి జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న వార్తలపై సంజయ్ దత్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.