ఉపాధి హామీలో ముందంజలో తెలంగాణ

563
Errabelli
- Advertisement -

తెలంగాణలో ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, పెన్షన్ల పంపిణీ తదితర పథకాలకు భారీగా నిధులు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కోరారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఢిల్లీలో అధికారులతో సమావేశం అయిన ఎర్రబెల్లి.. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు, కేంద్రం నుంచి రావాల్సిన 680 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా కోరారు ఎర్రబెల్లి. తెలంగాణ లోని గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు, మరుగుదొడ్లు, వైకుంఠదామాల నిర్మాణం,హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు.ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఆసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపించామని చెప్పారు.

కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మెటిరియల్‌ కాంపోనెంట్‌ నిధులను విడుదల చేయాలన్నారు. ఉపాధి హామీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.664 కోట్ల మెటిరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రావాల్సి ఉందన్నారు.

2018–19(గత ఏడాది)లో ఉపాధి హామీ పథకం మెటిరియల్‌ కాంపోనెంట్‌ నిధులలో కేంద్ర ప్రభుత్వం ఇంకా రూ.314 కోట్లు మన రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు. 2019–20(ప్రస్తుత ఏడాది)లో ఉపాధి హామీ కింద ఇప్పటికి రూ.673 కోట్ల మెటిరియల్‌ కాంపోనెంట్‌ నమోదైంది. దీంట్లో ఇంకా రూ.350 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పరిధిలోని 12,751 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోందని… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.30 లక్షల మంది కూలీలకు 8.63 కోట్ల పని దినాలు కల్పించామని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు.

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు :

2018–19 రూ. 314 కోట్లు

2019–20 రూ. 350 కోట్లు

మొత్తం రూ. 664 కోట్లు

- Advertisement -