సౌత్ సినిమాలో ఇటీవల వరుసగా పవర్‌ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్..తన సహ నటుల రాజకీయం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. విజయ్‌తో కలిసి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల సందర్భంలో మాట్లాడుతూ — తాను నటించిన దక్షణాది నటులందరికీ ఒక రాజకీయ అనుబంధం ఉందంటూ సరదాగా నవ్వులు పూయించారు.
నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ మరియు విజయ్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ బాబీ డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్’ చిత్రం విడుదల ఆలస్యమైన సమయంలో తాను విజయ్‌తో క్రమం తప్పకుండా సంప్రదింపుల్లో లేనని తెలిపారు. విజయ్ ఎక్కువగా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన పనినే మాట్లాడనివ్వడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు.
లేదండీ, నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయనకు ప్రచారాలు ఎక్కువ చేయడం నచ్చదు. తన పనిపైనే ఆయనకు నమ్మకం ఎక్కువ. అందుకే ఆయన ఆలోచనలకే నేను వదిలేశాను అని బాబీ తెలిపారు. ఈ సినిమాలో విజయ్‌కి వ్యతిరేకంగా ‘ఫీనిక్స్’ అనే బలమైన ప్రతినాయకుడి (విలన్) పాత్రలో బాబీ నటించారు. విజయ్ రాజకీయ ప్రయాణం వేగం పుంజుకుంటున్న తరుణంలో ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.
నేను ‘డాకు మహారాజ్’ సినిమాలో నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేశాను. అయితే ఇందులో ఒక కామెడీ ఏంటంటే.. నేను ఏ నటుడితో పనిచేసినా వాళ్లందరూ మంత్రులు అయిపోతున్నారు! ఇది చాలా సరదాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్‌తో చేశాను… ఊరికే సరదాకి అంటున్నాను అని నవ్వుతూ చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో బాబీ డియోల్ ‘ఔరంగజేబు’ పాత్ర పోషించారు.సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, సూర్యతో కలిసి పనిచేయడం ఎంతో సులభంగా అనిపించిందని బాబీ తెలిపారు. సూర్య భార్య జ్యోతిక ద్వారా ముంబైతో ఉన్న అనుబంధం వల్ల, వారిద్దరి మధ్య సంభాషణలు ఎంతో సహజంగా సాగాయని ఆయన పేర్కొన్నారు.
Also Read:వైభవ్‌పై శ్రేయాస్ ప్రశంసలు

