సాగర్‌లో నిండా మునిగిన కమలం..!

180
bandi
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కమలం పార్టీ అడ్రసు గల్లంతు కానుందా…సాగర్‌లో కూడా గెలిచి బీజేపీది వాపు కాదు గెలుపు అని చాటి చెప్పాలనుకున్న అధ్యక్షుడు బండి సంజయ్ కలలు కల్లలు కానున్నాయా…సాగర్‌లో కమలం పార్టీ నిండా మునగనుందా..అంతర్గత విబేధాలే పార్టీ కొంప ముంచనున్నాయా..సాగర్ బీజేపీ రెండుగా చీలిందా…ప్రస్తుతం నాగార్జున సాగర్‌ కమలం పార్టీలో మొదలైన కుమ్ములాటలు చూస్తే నిజమేనని అనిపిస్తున్నాయి. దుబ్బాకలో డ్రామాలతో, జీహెచ్‌ఎంసీలో వరద ముంపు పుణ్యమాని బీజేపీ గెలిచింది. సాగర్‌లో కూడా పార్టీని గెలిపించి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చాటిచెప్పాలని బండి సంజయ్‌ పట్టుదలగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక సిట్టింగ్ స్థానంలో తమ పట్టు నిలుపుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు.

సాగర్‌లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బండి సంజయ్‌ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత గులాబీ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను తమ పార్టీలోకి లాగి పోటీ చేయించాలని భావిస్తున్నాడు. దీనికి కారణం సాగర్‌ బీజేపీలోని లోకల్ లీడర్ల మధ్య ఏర్పడిన కుమ్ములాటలే కారణమని కాషాయపార్టీలో టాక్. ప్రస్తుతం ఉప ఎన్నికల నేపథ‌్యంలో సాగర్ బీజేపీ నేతల మధ్య అంతర్గత విబేధాలు రగులుతున్నాయి. ఇక్కడ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. నివేదితారెడ్డి సాగర్‌ బీజేపీలో బలమైన నాయకురాలు. గత ఎన్నికలలో కేసీఆర్ వేవ్‌లో డిపాజిట్ కోల్పోయినా..లోకల్‌గా ఆమెకు మంచి పేరు ఉంది. అయితే నివేదితారెడ్డితో పాటు స్థానికంగా మరో బలమైన నేత కడారి అంజయ్య యాదవ్ కూడా టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం ఎ‌వరికి వారు తమకే టికెట్ వస్తుందని నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

మరోవైపు సాగర్ ఉప ఎన్నికలకు ఇంచార్జ్ అయిన సంకినేని నివేదితారెడ్డిని వ్యతిరేకిస్తూ బీసీ సామాజికవర్గానికి చెందిన అంజయ్య యాదవ్‌కు మద్దతు పలకడంతో సాగర్ బీజేపీ రెండుగా చీలింది. సాగర్‌లో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉండడంతో అదే సామాజికవర్గానికి చెందిన నివేదితారెడ్డికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని 9 మండలాల బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను డిమాండ్ చేస్తున్నారు. నివేదితారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ గెలుపు కోసం పని చేయమని అధిష్టానాన్ని హెచ్చరించారంట..అసలు సర్పంచ్‌‌గా కూడా గెలవని అంజయ్య యాదవ్‌కు టికెట్ ఎలా ఇస్తారని నివేదితారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుందంట..ఈ విషయంలో ఇంచార్జి సంకినేనిపై బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారంట..మరోవైపు కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన జానారెడ్డి, టీఆర్ఎస్‌నుంచి తేరా చిన్నపురెడ్డి పేర్లు బలంగా వినిపిస్తుండడంతో బీసీ నాయకుడైన అంజయ్య యాదవ్ అయితేనే బెటరని ఆయన అనుకూల వర్గం వాదిస్తుందంట. సాగర్‌లో రెడ్డి సామాజికవర్గంతో పాటు యాదవ సామాజికవర్గం ఓటు బ్యాంకు కూడా బలంగా ఉందని అంజయ్య యాదవ్‌కు టికెట్ ఇస్తే బీసీలంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతారని మరో వర్గం వాదన.

ఈ నేపథ‌్యంలో సాగర్ బీజేపీ నివేదితా, అంజయ్య యాదవ్ వర్గాలుగా రెండుగా చీలిందంట. ఈసారి ఎలాగైనా సాగర్‌లో పోటీ చేయాలని డిసైడ్ అయిన నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్‌లు పార్టీ రాష్ట్ర నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారంట. సాగర్ బీజేపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇంచార్జి సంకినేని తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. సాగర్‌లో బలమైన అభ్యర్థి దొరకకపోవడంకు తోడుగా రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు…చివరకు పార్టీని ముంచడం ఖాయమని బండిసంజయ్‌ టెన్షన్ పడుతున్నారంట…చివరకు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ పార్టీలోని అసంతృప్త నేతకు కాషాయ కండువా కప్పి పోటీ చేయించాలని బండి భావిస్తున్నాడంట..అయితే నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్‌లు తమ ఇద్దరికి కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే మాత్రం…పార్టీ అభ్యర్థిని ఓడించి బండి సంజయ్‌కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారంట..మొత్తంగా సాగర్ బీజేపీ నేతల మధ‌్య నెలకొన్న అంతర్గత విబేధాలు కమలం పార్టీని సాగర్‌లో నిండా ముంచేయడం ఖాయమని కాషాయనేతలు కలవరపడుతున్నారు.

- Advertisement -