BJP:బీజేపీకి ఒంటరిపోరు..కలిసొస్తుందా?

24
- Advertisement -

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని చేతులు కాల్చుకున్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఆ పొరపాటు చేయకూడదని భావిస్తోంది. అందుకే ఈసారి ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగాలనే ప్లాన్ లో ఉన్నారు కమలనాథులు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సింగిల్ గానే బరిలోకి దిగాలని భావించినప్పటికి చివరి నిముషంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రాగా, జనసేన అసలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చేతులెత్తేసింది. దాంతో జనసేన కారణంగానే సీట్లు తగ్గాయనే భావన కమలనాథుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేనపార్టీ పొత్తును ఏపీ వరకు మాత్రమే ఉంచి తెలంగాణలో సింగిల్ గా బరిలోకి దిగేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

తాజాగా ఇదే విషయాన్ని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక పోతే ఈ నెల చివర్లో లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేందుకు కాషాయ పార్టీ సిద్దమౌతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి వారు గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లోనే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా గత ఎన్నికల బరిలో నిలిచిన చాలా మంది అభ్యర్థులకు మళ్ళీ సీటు కేటాయించే ఆలోచనలో ఉన్నారట. ఓవరాల్ గా 17 స్థానాలకు గాను పది స్థానాల్లో సీనియర్స్, 7 స్థానాల్లో కొత్తవారిని బరిలో దించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు వినికిడి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడ్డ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటుతుందో చూడాలి.

Also Read:వైసీపీ క్లారిటీ.. రాజధాని ‘అమరావతే’!

- Advertisement -