అదిలాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే పాయల్ శంకర్ భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ, అసైన్డ్ భూములను అక్రమ మార్గాల్లో తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారనే ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఆదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం గ్రామ పరిధిలో ప్రస్తుతం నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రభుత్వ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉన్న కోట్ల రూపాయల విలువైన భూములపై ఎమ్మెల్యే కన్నుపడింది. అక్కడ ఉన్న 7 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు మరో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని (మొత్తం 10 ఎకరాలు) పాయల్ శంకర్ నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వాస్తవానికి సదరు అసైన్డ్, ప్రభుత్వ భూములను కొనడానికి కానీ, వేరొకరికి అమ్మడానికి కానీ వీలులేదని గతంలోనే స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ అక్కడ ఏకంగా లేఅవుట్ చేసి ప్లాట్లుగా మార్చేశారు.
గతంలో ఈ భూములకు సంబంధించి అక్రమ మార్గాల్లో సంపాదించిన ఎన్వోసీ (NOC – నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇప్పటికే రద్దయింది. అయితే ఆ ఎన్వోసీ రద్దయిన విషయాన్ని రిజిస్ట్రేషన్ అధికారుల దగ్గర దాచిపెట్టి, పాత రికార్డుల ఆధారంగానే ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.
Also Read:ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్రమంగా కబ్జా చేసి, లేఅవుట్ పరిధిలోకి తెచ్చిన ఈ స్థలంలో దాదాపు 11 ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. మార్కెట్ ధరల ప్రకారం ఈ 11 ప్లాట్ల మొత్తం విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిరుపేదలకు చెందాల్సిన అసైన్డ్ భూములను, ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఈ విధంగా స్వాహా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


