సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కర్ణాటకలోని కొడగు జిల్లాలో రిల్స్ కోసం కొందరు కాలేజ్ విద్యార్థులు చేసిన సాహసం వారి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రసిద్ధ మల్లల్లి జలపాతం వద్ద అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో ఒక విద్యార్థుల బృందం వరద నీటి మధ్యలో చిక్కుకుపోయింది.
నిషేధిత ప్రాంతంలోకి దూసుకెళ్లి..స్థానికులు మరియు అధికారుల సమాచారం ప్రకారం.. కొందరు కాలేజీ విద్యార్థుల బృందం మల్లల్లి జలపాతాన్ని సందర్శించడానికి వచ్చింది. అక్కడ రిల్స్ మరియు ఫోటోలు తీసుకోవాలనే ఉత్సాహంతో, వారు పర్యాటకుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భద్రతా బ్యారికేడ్లను దాటారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ప్రమాదకరంగా ఉండే రాళ్లపైకి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని ప్రమాదకరమైనదిగా గుర్తించి ఇప్పటికే నిషేధిత జోన్‌గా ప్రకటించినప్పటికీ విద్యార్థులు లోపలికి ప్రవేశించారు. అకస్మాత్తుగా పెరిగిన నీటి ఉధృతివిద్యార్థులు రాళ్లపై నిలబడి రిల్స్ తీసుకుంటున్న సమయంలో.. ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది.
చూస్తుండగానే చుట్టూ నీరు చేరిపోవడంతో వెనక్కి వచ్చే దారి లేక విద్యార్థులంతా ఆ రాళ్లపైనే చిక్కుకుపోయి ప్రాణభయంతో కేకలు వేశారు. సకాలంలో స్పందించిన రెస్క్యూ టీంవిద్యార్థుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై స్థానిక అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, స్థానికుల సహాయంతో తాడులు, రక్షణ కవచాల సాయంతో గంటల పాటు శ్రమించారు. సకాలంలో స్పందించి సురక్షితంగా ఆ విద్యార్థులందరినీ నీటి ప్రవాహం నుండి బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం, క్షణికావేశంలో ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు మరియు పోలీసులు పర్యాటకులను, ముఖ్యంగా యువతను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. జలపాతాలు, నదుల వద్ద భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

