భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, అంతర్జాతీయంగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇండోనేసియా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఖరారు చేసింది.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన ఈ కీలక భేటీ సందర్భాన్ని పురస్కరించుకుని, ఇండోనేసియా ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కార నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది.
Also Read:7 వేల కోట్లు..9 వారాలకే రోడ్డు క్లోజ్!
తమ దేశ అత్యున్నత గౌరవానికి ఎంపిక చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కేవలం వ్యక్తిగతంగా తనకు దక్కినది కాదని, 140 కోట్ల మంది భారత ప్రజలకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు ద్వారా భారత్-ఇండోనేసియా దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక, మైత్రి బంధం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

