కేవలం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే మునుగోడుకు ఉప ఎన్నిక తెచ్చారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవదని ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంట ఉన్నారని అన్నారు. నవంబర్6న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రంలో మోదీ ఇమేజ్ కూడా రోజురోజుకు తగ్గుతుందన్నారు. బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్‌ను పరిమితం చేసేలా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.
గుజరాత్‌లో మోటార్లకు మీటర్లు పెట్టారు. గత ప్రభుత్వాలు మునుగోడు ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపలేదు. ఆరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌కు చెక్ పెట్టింది. నల్గొండ కాంగ్రెస్ నేతలు ఎదిగారు తప్ప అక్కడి సమస్యలు మాత్రం తీర్చలేదు. వ్యక్తుల ప్రాబల్యంతోనే గత ఉప ఎన్నికల్లో గెలిచారు తప్ప బీజేపీతో కాదు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ఆ స్థానంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో టచ్‌లో ఉన్నానని చెప్పటం దిగజారుడుతనమని నిప్పులు చెరిగారు.
ఒక వ్యక్తిని కొనటానికి మోదీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ. 18 వేల కోట్ల కాంట్రా క్ట్ వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థే.. ప్రజల్లో మాత్రం బలహీన అభ్యర్థి అని విమర్శించారు. మునుగోడులో ఉన్న సమస్యలు తీర్చింది కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. బీజేపీని ఓడగొట్టేందుకు టీఆర్ఎస్ పోరాడుతుందని మంత్రి ఉద్ఘాటించారు. అందుకే కమ్యూనిస్టులు మాతో కలిసి వస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ మాతో కలిసి పని చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. రాజీనామాతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మటం లేదు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి. ఫలితం రాబోయే సాధారణ ఎన్నికలపై పడుతుంది. మునుగోడులో ఓడిపోతే పదవి నుంచి తీసివేస్తారనే భయం రేవంత్‌కు పట్టుకుంది. ఏడ్చే వారికి ఏం సమాధానం చెప్తాం. బీఆర్‌ఎస్‌తో తెలంగాణ అస్తిత్వానికి ఏం ప్రమాదం లేదన్నారు. వంద శాతం ప్రజల మద్దతు ఏ ప్రభుత్వానికి ఉండదు. మేము ఉద్యమంలో తెచ్చిన ఉప ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను పోల్చవద్దు అని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.