అవినీతి నేతలకు కాంగ్రెస్‌లో మంచి డిమాండ్- జీవీఎల్‌

269
- Advertisement -

రేవంత్ రెడ్డి వంటి అవినీతి నేతలకు కాంగ్రెస్ పార్టీలో మంచి డిమాండ్ ఉందని.. రేవంత్ అవినీతి వ్యవహారాలు తెలిసే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కాంగ్రెస్ కట్టబెట్టిందని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావు మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలతో రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడిందన్నారు. కబ్జాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసి కోట్లు సంపాదించారని.. సెటిల్‌మెంట్లతో రూ. 11 కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్ రెడ్డి బావమరిదే చెప్పారని జీవీఎల్‌ వివరించారు.

ఐటీ విచారణకు హాజరై.. బయటకు వచ్చి ఫోజులు కొట్టిన రేవంత్.. తనపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాలని జీవీఎల్ నిలదీశారు. అసలు కేఎస్‌ఎల్‌ఆర్ సంస్థ ఎవరిదో రేవంత్ చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి మామ వద్ద రూ. 11 లక్షలు, బావమరిది దగ్గర రూ. 1.2 కిలోల బంగారాన్ని ఐటీ సీజ్ చేసిందని.. కేఎల్‌ఎస్‌ఆర్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి వద్ద రూ. 1.40 కోట్ల రూపాయలు దొరికాయని ఆయన వెల్లడించారు. భూలావాదేవీలతో నల్లధనాన్ని సంపాదించి అక్రమాలకు పాల్పడ్డారని.. ఓటుకు నోటు కేసులో కుంభకోణానికి పాల్పడి అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికిపోయాడని చెప్పారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఇచ్చిన భూముల్లో అక్రమాలు జరిగాయని జీవీఎల్ విమర్శించారు.ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడేమీ కాదని.. భూకబ్జాదారులను వెనకేసుకుని వచ్చిన ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే “ఇమ్మోరల్ నేషనల్ కరప్ట్ కాంగ్రెస్” అని ఎద్దేవా చేశారు.

- Advertisement -