కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు దాఖలైంది. ఐపీసీ 499,500(పరువునష్టం) సెక్షన్ కింద డియోరియా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రాహుల్ పై బీజేపీ నేత షలబ్ మణిత్రిపాఠి కేసు వేశారు. ఈ కేసుపై ఏప్రిల్ 5న విచారణ జరుగుతుందని త్రిపాఠి న్యాయవాది తెలిపారు.
మార్చి 16న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తన ప్రసంగంలో ప్రధాని మోదీతో .. నీరవ్ మోదీ (కళంకిత వజ్రాల వ్యాపారి), లలిత్ మోదీ (ఐపీఎల్ మాజీ కమిషనర్)లను పోల్చుతూ వ్యాఖ్యలు చేశారని, అవినీతికి పర్యాయపదంగా మోదీ పేరు మారిందంటూ ఎద్దేవా చేశారని అందుకే రాహుల్‌పై కేసు దాఖలు చేశానంటూ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
రాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ కార్యకర్తలు, దేశప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున ఆయనపై పరువునష్టం కేసు వేసినట్టు తెలిపారు.
అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా దూకుడు ప్రదర్శించింది. అవినీతికి కళ్లెం వేయడంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని, అవరసమైతే దేశం కోసం జైలుకు కూడా వెళ్ళడానికి రెడీగానే ఉన్నామని కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సెన్ తెలిపారు.