బీహార్‌లో దోస్త్‌ కటీఫ్‌…నెక్ట్స్‌ ఎంటీ!?

30
bihar
- Advertisement -

బీహార్‌ లో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇంతకాలం బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్‌ వేశారు నితీశ్‌ కుమార్‌. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

బీహార్ అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీకి 77, జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఏన్డీయే కూటమికి 122 మంది బలం ఉంది. ఆర్జేడీకి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ నేతృత్వం వహిస్తున్నారు. కాగా..ఆర్జేడీకి 79 మంది , కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. లెఫ్ట్ పార్టీలకు 16 మంది శాసనసభ్యుల బలం ఉంది. హిందుస్తానీ అవామ్ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యేగా ఒకరు ఉండగా.. మరోస్థానం ఖాళీగా ఉంది.

గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఆర్జేడీపై అవినీతి ఆరోపణలతో కొంతకాలం క్రితం ఆ పార్టీ నుంచి బయటకొట్టి బీజేపీతో జట్టు కట్టారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా.. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు 122 నియోజవర్గాల్లో గెలుపొందారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచినా.. మిత్రధర్మం పాటిస్తూ నితీశ్ కుమార్ కే సీఎం పదవి అప్పగించింది.

గత కొంతకాలంగా బీజేపీ, జేడీయూ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. బీహార్ లో కూటమి ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తున్నప్పటికీ పలు అంశాల్లో మాట చెల్లుబాటు కావట్లేదని ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు జేడీ నేత నితీశ్ త‌మ ఎమ్మెల్యేల‌కు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో క‌లిసి నితీశ్ కుమార్‌.. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొన‌సాగ‌నున్నారు. కొన్ని ఊహాగానాల ప్ర‌కారం ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌కు హోంశాఖ ఇవ్వ‌నున్నారు. నితీశ్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

- Advertisement -