బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిత్తిరి సత్తి అంటే తెలియనివారుండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనతికాలంలోనే యాంకర్ గా విశేషమైన పాపులారిటీ దక్కించుకొన్న బిత్తిరి సత్తి ఈమధ్య సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇప్పుడు మరోసారి తన టైమింగ్ పంచులతో `నేనే రాజు నేనే మంత్రి` ప్రచార వేడుకలో హల్ చల్ చేశాడు. ఎప్పటికప్పుడు కౌంటర్లు, పంచ్‌లు వేస్తూ వేడుకలో పాల్గోన్న వారందరినీ నవ్వుల్లో ముంచేశాడు. ముఖ్యంగా ఆ సినిమా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసాలను సత్తి ఆటపట్టించిన విధానం అందరికీ నచ్చింది. బిత్తిరి సత్తి మాట్లాడుతున్న ఇంగ్లిషు అర్థం కాక కాజల్ బిత్తర చూపులు చూసింది..
టాప్ హీరోయిన్‌గా మారిన తర్వాత మధ్య మధ్యలో విటమిన్ (ఐటమ్) సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు అని అడుగగా కాజల్ అర్థం కాలేదు. దాంతో నవదీప్ వచ్చి విటమిన్ అంటే ఐటమ్ అని వివరించాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో మీది విటమిన్ క్యారెక్టరా లేదా మంచి క్యారెక్టరా అని కాజల్‌ను బిత్తిరి సత్తి అడిగాడు. విటమిన్ క్యారెక్టర్ కాదు.. మంచి పాత్రే చేస్తున్నానని కాజల్ సమాధానం ఇచ్చింది. కాజల్ మీద సత్తి మరికొన్ని పంచ్‌లు వేయబోతుండగా ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రానా, సత్తి పంచ్‌లకు బ్రేక్‌లు వేశాడు. తర్వాత కేథరీన్ ను నువ్వు ఫుడ్ సప్లై చేస్తావా? మరెందుకు కేటరింగ్ అని పేరు పెట్టుకున్నావ్?`, `ఎప్పుడూ సెకండ్ హీరోయిన్‌గానే ఎందుకు చేస్తున్నావ్?`, `సినిమాలో సిగరెట్ తాగి ముకేశ్ లాగ అయిపోయావ్!` అంటూ తనదైన చేష్టలతో సత్తి అందరినీ నవ్వించాడు.
దర్శకుడు తేజను కూడా వదలని సత్తి.. ఆ మధ్య మెడకు పట్టీ కట్టుకున్నవ్.. కదా.. ఎవరైనా జబ్బ మీద సరిశిండ్రా అనడంతో తేజకు ఏం చెప్పాలో తెలియక నవ్వాడు. తనికెళ్ల భరణితో సందు పళ్లు ఉంటే అదృష్టమట కదా అని.. హీరో రానా గుద్ది చంపిన బర్రె పాలిచ్చే బర్రెనా.. దున్నపోతా.. అని చిలిపి ప్రశ్నలడుగుతుంటే రానా.. పడిపడి నవ్వాడు.. ముఖ్యంగా రానా, నవదీప్, సురేష్ బాబు, కాజల్, తనికెళ్ల భరణి, పరుచూరి బ్రదర్స్ పడిపడి నవ్వడం కనిపించింది. సత్తి మాట్లాడినప్పుడల్లా వేడుకకు హాజరైన అభిమానులు పెద్దగా చప్పట్లు కొట్టడం, అరవడం చేశారు.