ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్ పేరును ఖరారు చేస్తు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో సుదీర్ఘ చర్చ అనంతరం రామ్‌నాథ్ కోవిద్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా వివిధ రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి మద్దతు తెలుపాల్సిందిగా కోరారు.
దళిత వర్గానికి చెందిన వారిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసిన మోడీ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతిగా ఎంపిక చేయాలని మీరు సూచించారు. మీ సూచన మేరకు దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నాను, మీ పూర్తి మద్దతు కోరుతున్నాను అని మాట్లాడారు. తక్షణమే సీఎం కేసీఆర్ పార్టీ నేతలను సంప్రదించారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు ప్రధాని విజ్ఞప్తి మేరకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఒక దళిత నేతకు అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా మద్దతిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా ఉన్న రామ్ నాథ్ ఈ నెల 23న రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
1945, అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు రామ్ నాథ్ కోవింద్ . అడ్వకేట్‌గా ఆయన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వరకు ఆయన సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయన సుప్రీంకోర్టులో అడ్వకేట్-రికార్డ్‌గా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయన 16 ఏళ్లు పనిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో 1971లో రామ్‌నాథ్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
1994లో యూపీ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎంపికయ్యారు. 2006 వరకు ఎంపీగా ఆయన రెండుసార్లు చేశారు. పార్లమెంట్‌కు చెందిన అనేక కమిటీల్లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంట్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, హోంశాఖ, పెట్రోల్ మరియు ఇంధనం, సామాజిక న్యాయం, లా అండ్ జస్టిస్, రాజ్యసభ హౌజ్ కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు సవితా కోవింద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Hon'ble PM @narendramodi Ji has telephoned Sri KCR garu seeking support for Sri Ramnath Kovind Ji as President. Our CM has agreed to support
— KTR (@KTRTRS) June 19, 2017