బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 45 రోజులు పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్…తాజా ఎపిసోడ్‌లో వారికి చుక్కలు చూపించారు. బిగ్ బాస్ ఆదేశాలను ఎవరు పాటించడం లేదని ఇష్టం లేకపోతే వెళ్లి పోవచ్చని మండిపడిన సంగతి తెలిసిందే.
ఇక తాజా ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులను శిక్షించాలని హౌజ్ లోకి దొంగల్ని పంపించాడు. కొంతమంది ముసుగు వేసుకొని వచ్చి ఇంట్లో అన్ని చోట్ల ఉన్న ఫుడ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేశారు. దీంతో కంటెస్టెంట్స్ ఆకలికి అలమటించిపోయారు.
తర్వాత అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుండగా ఫుడ్ కావాలంటే చెప్పిన టాస్క్‌లు చేయాలని తెలపగా అంతా ఓకే చెప్పారు. తర్వాత ఇంటి సభ్యులని రెండు టీంలుగా విడగొట్టి.. మొదట అన్నం, పప్పు హౌజ్ లోకి పంపించి అది గెలుచుకోవాలంటే కబడ్డీ ఆడాలి, కబడ్డీ ఆడిన టీంకి ఆ ఫుడ్ లభిస్తుంది అని చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా కబడ్డీ ఆడగా గెలిచిన టీం ఫుడ్ ని తీసుకుంది.
గెలుచుకున్న ఫుడ్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా తినాలి అని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తర్వాత మరో టాస్క్ లో చపాతీలు, కూర పంపించి బాల్స్ తో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడించాడు. ఈ సారి కూడా రెండు టీమ్స్ లాగే ఆడారు. మరో టీం చపాతీలని గెలుచుకుంది. అయితే బిగ్‌బాస్ చెప్పిన ఫుడ్ షేర్ చేసుకోకూడదు అనే రూల్ ని బ్రేక్ చేసి ఆదిరెడ్డి వేరే టీంలో ఉన్న గీతూకి చపాతీ షేర్ చేశాడు. దీంతో బిగ్‌బాస్ వాళ్ళకి పనిషమెంట్ ఇచ్చాడు.