బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 60 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 60వ ఎపిసోడ్లో భాగంగా పల్లెకు పోదాం చలో అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో హారిక మూడు హత్యలు చేయాలని తెలపగా ఒక హత్య చేయడం,తిండికోసం మెహబూబ్ గొడవ పడటం,సోహైల్-అఖిల్ మధ్య గొడవ కంటిన్యూతో ఎపిసోడ్ ముగిసింది.
తొలుత అఖిల్ నామినేట్ చేయడంతో షాక్‌లోకి వెళ్లిన మోనాల్‌ను ఓదార్పు కార్యక్రమం చేపట్టాడు అభి. అసలు నిన్ను ఎందుకు టార్గెట్ చేశారు అందరూ అంటూ పుల్లలు పెట్టే ప్రయత్నం చేశాడు. వాళ్ల అభిప్రాయంలోనే నేను వీక్.. గివ్ అప్ ఇస్తానని వాళ్ల ఉద్దేశం.. అది నిజమే.. నేను మిస్టరీ గర్ల్‌ని అందుకే అని చెప్పింది మోనాల్.
తర్వాత కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్‌లో భాగంగా పల్లెకు పోదాం ఛలో ఛలో అనే టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ పల్లెటూరుగా మారబోతుందని.. ఇందులో ఇంటి సభ్యులకు తగిన పాత్రలు ఉంటాయని తెలిపాడు. పల్లెటూరు వాతావరణం, వస్తుమార్పిడి పద్దతి, ధాన్యాన్ని దంచి బియ్యం చేయడం లాంటి వాటితో కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు బిగ్ బాస్.
గ్రామ పెద్దగా సొహైల్..అరియానా-లాస్యలు ఈ టాస్క్‌లో తల్లీ కూతుళ్లని.. లాస్య గ్రామ పెద్ద (సొహైల్) భార్య అని చెప్పారు బిగ్ బాస్. ఇక అరియానా గ్రామపెద్ద కూతురని.. ఊర్లోని అబ్బాయిలు అందరూ ఇష్టపడుతూ ఉంటారని చెప్పారు. అమ్మా రాజశేఖర్ కష్టపడి పనిచేసే గ్రామస్థుడని గ్రామ పెద్దకి గ్రామంలో జరిగే అన్ని విషయాలను చేరవేస్తారని.. అలాగే గ్రామ పెద్ద భార్యని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని తెలిపారు.
అఖిల్ ఏ బాధ్యత లేని గ్రామస్తుడని.. గ్రామ పెద్దని ఎదురు ప్రశ్నిస్తారని తెలిపాడు. అభిజిత్-మోనాల్ వీరిద్దరూ వంట సిద్ధం చేసే జంట అని.. వంట సిద్ధం చేసి దాన్ని గ్రామస్తులకు అమ్మిపాన్, బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. హారిక గ్రామంలో పుకార్లు పుట్టించే అమ్మాయి అని…పాన్ షాప్ యజమాని తమ్ముడు మీ ప్రియుడు అని.. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా మూడు హత్యలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. రాజశేఖర్‌పై కాఫీ చల్లడం, అవినాష్‌కి కోపం తెప్పించడం, మీరు చంపాలనుకుంటున్న వ్యక్తి పేరు ఏదో ఒక విండోపై లిప్ స్టిక్‌తో రాయడం వంటివి చేయాలన్నారు. అవినాష్ పాన్ షాపు యజమాని అని.. అతని తమ్ముడు మెహబూబ్ అని.. అవినాష్ అరియానాని ప్రేమిస్తూ ఉంటారని చెప్పారు బిగ్ బాస్.
దీంతో ఎవరికి ఇచ్చిన పాత్రల్లో అదరగొట్టారు. హారికకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా మొదట హత్యను కంప్లీట్ చేసింది. ముందే తెలివిగా కాఫీ కలుపుకుని పక్కన పెట్టుకుని టైం చూసి అమ్మా రాజశేఖర్‌పై పోసేసింది హారిక. తర్వాత దానిని తెలివిగా కవర్ చేసింది.