బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 20 హైలైట్స్!

106
episode 20

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 20 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక 20వ ఎపిసోడ్‌లో గంగవ్వ కెప్టెన్‌గా ఎన్నికవడం,మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ,ఇప్పటివరకు మొనాల్‌తో క్లోజ్‌గా ఉంటూ వస్తున్న అభి తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన స్వాతితో కూడా పులిహోర కలుపుతుండటం ఈ ఎపిసోడ్ హైలైట్స్‌.

ఉక్కు హృదయం టాస్క్‌లో వరస్ట్ పెర్ఫామర్‌గా నిలిచిన నోయల్‌ జైలు శిక్షలో భాగంగా తిరగలితో రాగిపిండి వేసి పిండి చేయడంతో చెమటలు కక్కాడు.మిగితా సభ్యుల్లో అభిజిత్, సొహైల్, దివి, రాజశేఖర్ మాస్టర్‌లు ఉక్కు హృదయం టాస్క్ గురించే చర్చించుకున్నారు. ఆడ పిల్లని కిడ్నాప్ చేసినప్పుడు తిరిగి ఆడపిల్లకే చార్జింగ్ ఇవ్వొచ్చు కదా అంటూ అభిని దివి ప్రశ్నించగా నా ఇష్టం అంటూ వాదించాడు.

ఇక జైలులో ఉన్న నోయల్‌తో కలిసి రాజశేఖర్ మాస్టర్, దివి, అభిజిత్, సొహైల్, మొహబూబ్‌‌లు బిగ్ బాస్ మై డ్రీమ్.. ఆల్ ది కంటెస్టెంట్స్ ఆర్ మై బ్రదర్స్ సిస్టర్ అంటూ ప్లెడ్జ్ చేశారు. తర్వాత నోయల్ జైలు శిక్షాకాలం ముగిసినట్టు ప్రకటించగానే ఇంటిసభ్యులందరూ బీభత్సమైన డ్యాన్స్‌తో అలరించారు. ఇక ఇంట్లో నీకు ఎవరూ ఇష్టం అంటూ గంగవ్వను అడిగింది హారిక. తనకు నువ్వు,అరియానా,అఖిల్ అంటే ఇష్టమని మొనాల్‌ అంటే ఇష్టం లేదని తేల్చిచెప్పింది గంగవ్వ.

ఉక్కు హృదయం టాస్క్ లో బెస్ట్ పెర్ఫామర్లుగా నిలిచిన గంగవ్వ, హారిక, అవినాష్, అభిజిత్‌లకు రంగు పడుద్ది టాస్క్ ఇవ్వగా ఇంటి సభ్యులు అందరూ గంగవ్వను సేవ్ చేసి కెప్టెన్‌ని చేశారు. తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని ఇంటిసభ్యులకు పనిష్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ పాయింట్‌లను రద్దు చేయడంతో పాటు రేషన్‌లో కోత విధించారు. మళ్లీ రిపీట్ అయితే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇక మూడోవారంలో మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను హౌస్‌లోకి పంపారు బిగ్ బాస్. స్వాతి దీక్షిత్ రావడంతోనే మాటలు కలిపిన అభిజిత్.. ఇప్పటి వరకూ హౌస్‌లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి ముచ్చట్లు, ఇంటి సభ్యుల గుసగుసల మధ్య 20వ ఎపిసోడ్ ముగిసింది.