జమ్మూ కశ్మీర్‌లోని బరాముల్లా ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ అకిబ్ నబీ భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎన్నో అడ్డంకులను అధిగమించి టీమిండియా స్థాయికి ఎదిగిన అతడి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ.. అకిబ్ కుటుంబంలో మాత్రం చదువుకే మొదటి ప్రాధాన్యత ఉండేది. అతడి తండ్రి గులాం నబీ దార్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తన కుమారుడు డాక్టర్ కావాలని ఆయన ఆశించారు. దీంతో క్రికెట్ కోసం చదువును పక్కన పెట్టడాన్ని మొదట్లో ఆయన వ్యతిరేకించారు.
అయితే అకిబ్ పట్టుదల, క్రికెట్‌పై ఉన్న ఆసక్తి క్రమంగా తండ్రి మనసును మార్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ నిర్వహించిన పేస్ బౌలింగ్ శిక్షణ శిబిరానికి హాజరయ్యే అవకాశం అతడికి లభించింది. ఆ శిబిరంలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ నుంచి శిక్షణ పొందే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో అకిబ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చదువును వదిలి క్రికెట్ శిక్షణకు వెళ్లడాన్ని తండ్రి అంగీకరించకపోయినా.. చివరకు ఒప్పుకున్నారు. ఆ నిర్ణయమే అతడి క్రికెట్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
బరాముల్లాలోని షీరీ గ్రామానికి చెందిన అకిబ్ తొలుత వీధుల్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. స్నేహితుడి ప్రోత్సాహంతో క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అతడికి చిన్నప్పటి నుంచి ఆదర్శం. అతడి బౌలింగ్ శైలిని అనుకరిస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను కూడా ఎంతో ఇష్టపడుతున్నాడు.
Also Read:ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం!
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన అకిబ్.. రంజీ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. 2024-25 సీజన్లో 44 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు. నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించే స్థాయికి ఎదిగాడు.
ఒకప్పుడు క్రికెట్ కోసం కుటుంబాన్ని ఒప్పించాల్సి వచ్చిన అకిబ్.. నేడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంటున్నాడు. బరాముల్లా నుంచి టీమిండియా వరకు సాగిన అతడి ప్రయాణం పట్టుదల, కష్టపడేతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

