చిన్న జీయర్ ఆశ్రమాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క..

13

వెయ్యేండ్ల క్రితమే మానవులందరూ సమానమే అని, సమాజంలో అంతరాలు లేకుండా వసుదైక కుటుంబంగా ఉండాలని, సమానత్వం గురించి చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త రామానుజల వారి భావాజాలన్ని విశ్వ వ్యాప్తం చేయడం కోసం ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ ఏర్పాటు చేసిన త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మచ్చెర్లలోని చిన్న జీయర్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈసందర్భంగా అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆనంతరం చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు వెయ్యి ఏండ్ల క్రితం సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది, వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారు అని గుర్తు చేశారు. ప్రతీ మనిషి లో దైవత్వం ఉందని, మనుషులందరూ సమానమే అని సందేషాన్ని చాటి చెప్పి, రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు రామానుజల వారు చేరవేశారని తెలిపారు. రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని రాజ్యంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ కూడ ఒక వ్యాసంలో రాశారని వెల్లడించారు. రామానుజల వారు అంటే నేను అమితంగా గౌరవీస్తాను అని తెలిపారు. రాజమనుజల వారు అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శమని పేర్కొన్నారు. గొప్ప ఫిలాసఫీ ఉన్న రామానుజల వారి విగ్రహం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణకు ఒక ఐకాన్ ఉంటుందన్నారు.

రామానుజల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం అద్భుతంగా ఉందని, రామనుజుల వారి సందేశం యావత్ దేశ ప్రజలకు అందేలా చిన్న జీయర్ స్వామి చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని తెలిపారు. రామానుజల వారిని ప్రభావతం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి కావడం తెలంగాణ కు గర్వకారణమన్నారు. సమానత్వం కోరుకునే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలి అని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరుగుతున్న ఈ మహోత్సవానికి ముందు రావడానికి కారణం ఉందన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలో తన పాదయాత్ర ఉండే అవకాశం ఉన్నందున వైకుంఠ ఏకాదశి రోజున రామనుజుల వారి విగ్రహాన్ని చూడటం కోసం వచ్చానని, చాల సంతోషంగా ఉందని వెల్లడించారు.