కౌగిలింతలో ఎన్నో వింతలు..!

630
- Advertisement -

వ్యాయామం, మెడిటేషన్.. వంటివి చేయడం వల్ల ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గిపోయి గుండె, శ్వాసవ్యవస్థలు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటాయో అలాగే కౌగిలించుకోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమైపోతున్నా.. ఇలా ఎలాంటి భావాన్నైనా ఒకరితో పంచుకోవడానికి వారధిలా ఉండేదే ‘కౌగిలింత’. అందుకే మనసుకు ఏ ఫీలింగ్ కలిగినా ఒక్కసారి ఆత్మీయులను ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయంటున్నారు పరిశోధకులు. ప్రేమగా ఇచ్చే కౌగిలితో ఆరోగ్యం సిద్ధిస్తుంది.. ఆరోగ్యలాభం.. కౌగిలిలో ఒదిగిపోయిన పురుషుల కన్నా.. మహిళలకే ఎక్కువగా ఒనగూరుతుందని   పరిశోధకులు వెల్లడించారు.

కౌగిలిలో తలదాచుకున్నప్పుడు స్త్రీ-పురుషులిద్దరి శరీరంలోనూ ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని, వాటి ప్రభావంతో మానసిక సమస్యలు దూరమవుతాయని తెలిసింది. ఆలింగనం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అదెలాగంటే.. గాఢంగా ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందట. అలాగే కండరాలు, ఇతర శరీర భాగాల్లో ఉండే నొప్పులు మాయమై ప్రశాంతత సొంతమవుతుందనేది నిపుణుల అభిప్రాయం.

Also Read:పవన్ సినిమాల పై లేటెస్ట్ అప్ డేట్స్

దీర్ఘ కౌగిలిలో.. మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా.. ఇతర శరీర అవయవాలకు పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ పంపిస్తుందట. కౌగిలి సమయంలో ‘ఫీల్‌ గుడ్‌’ హార్మోన్లుగా పేరున్న డొపమైన్‌, సెరోటోనిన్‌ విడుదలవుతాయని పరిశోధకులు వెల్లడించారు. మూడ్‌ను మార్చడంలో ఈ హార్మోన్లు కీలకంగా పనిచేస్తాయి. ఒంటరిగా ఉన్నామన్న భావన ఏమైనా ఉంటే.. ఆలింగనంతో అది దూరమవుతుందట. మొత్తమ్మీద కౌగిలింతలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో వింతలు ఉన్నాయని తేలింది. కౌగిలింత ఇతరులపై ఉండే ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే కాదు.. శారీరకంగా రిలాక్సవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

Also Read:CMKCR:జూన్ 30న పోడు పట్టాల పంపిణీ

- Advertisement -