వింటర్ లో పిల్లలకు ఆస్తమా.. జాగ్రత్త!

20
- Advertisement -

సాధారణంగా ఆస్తమా ఆస్తమా అనేది వయసు పైబడిన వారిని ఎక్కువగా వేధించే సమస్య. అయితే కాలుష్యం కారణంగా, మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలామంది పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు. కొందరికి ఈ సమస్య వంశపారపర్యంగా కూడా సంక్రమిస్తుంది. మరికొందరిలో ఊబకాయం, అధికబరువు వంటి సమస్యల కారణంగా కూడా ఆస్తమా ఏర్పడుతుంది. అన్నిటికి మించి పది సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లల్లో ఆస్తమా వస్తే అది ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా శ్వాస తీసుకోవడంలో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి ఆస్తమా లక్షణాలు కూడా కావొచ్చు. కాబట్టి పిల్లల ఆరోగ్యంపై కొంత దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. .

పిల్లలు తరచూ దగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే ఆస్తమా దరిచేరకుండా ఉండాలంటే ఆహార నియమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. దానియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం వంటి వాటికి ఆస్తమాను అదుపులో ఉంచే గుణాలు కల్గి ఉంటాయి. కాబట్టి వీటిని కూరల్లో తగు పరిమాణంలో వాడడం వల్ల ఆస్తమాను అరికట్టవచ్చు. అయితే వీటి పరిమాణం ఎక్కువగా ఉంటే కూడా ఆస్తమా ఎటాక్ అయ్యే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా పిల్లలకు స్ట్రాబెర్రి, బొప్పాయి, ఆపిల్, వంటి పండ్లను తినిపించాలి, అలాగే కిస్ మిస్, బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఇస్తూ ఉండాలి. వీటివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ శాతం పెరిగి ఆస్తమాను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఇక పిల్లలు ఎక్కువగా శీతల పానీయాలు సేవించేందుకు మక్కువ చూపిస్తుంటారు. చలికాలంలో పిల్లలకు వాటిని దూరంగా ఉంచాలి. ఎందుకంటే చల్లగా ఉండే పానీయాలు పిల్లలు సేవించినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే ఉదయం పూట పిల్లలను చల్లటి వాతావరణంలో తిప్పరాదు. కాబట్టి ఈ చలికాలంలో పిల్లలకు ఆస్తమా అటాక్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి.

Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

- Advertisement -