కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ తాజా సీజన్ ను స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్ విడదల చేసింది. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుదల చేసింది. 14వ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. ఇక ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో జరగనున్నాయి.దేశంలోని ఆరు వేదికల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా) ఈ టోర్నీ జరగనుంది.
ప్రతి టీమ్ నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తలా 10 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండగా, అహ్మదాబాద్, ఢిల్లీ చెరో 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, లీగ్ దశ పోటీలకు ప్రేక్షకులను అనుమతించరాదని నిర్ణయించుకున్నారు. ప్లే ఆఫ్ దశ నుంచి మైదానాలకు ప్రేక్షకులను అనుమతిస్తారని తెలుస్తోంది. ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే అన్ని టీమ్స్ తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఏ టీమ్ కూడా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోవడం లేదు.