తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయ్యి ఇన్ని వారాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక ట్విస్ట్ లేదు.. ఒక వైల్డ్ ఎంట్రీ లేదు.. ఒక ఆకట్టుకునే అంశం జరగలేదు అంటూ అంతా కూడా జుట్టు పీక్కుంటున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ నుండి లోబోను ఇంటి సభ్యుల జడ్జిమెంట్ ఆధారంగా బయటకు పంపిస్తున్నట్లుగా ప్రకటించారు. శనివారం రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా నాటకీయంగా సాగింది. ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూంకి పిలిచిన నాగార్జున.. హౌజ్‌లో ఉండే అర్హత ఎవరికి లేదో చెప్పాలని అన్నారు. ముందుగా వచ్చిన మానస్.. శ్రీరామ్ పేరు చెప్పాడు. అనంతరం సన్నీ.. ప్రియ పేరు చెప్పాడు. ఇక కాజల్.. ప్రియ; అనీ మాస్టర్, శ్వేత, సిరి, షణ్ముఖ్..లోబో పేరు ప్రస్తావిచారు. శ్రీరామ్.. రవి పేరు చెప్పాడు. ప్రియ, ప్రియాంక.. కాజల్ అన్‌ఫిట్ అని అభిప్రాయపడ్డారు.
జెస్సీ.. పక్కవాళ్లను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ వారి గేమ్ చెడగొడుతున్న రవి వెళ్లిపోవాలని కోరుకున్నాడు. రవి.. కాజల్ హౌస్‌లో అనర్హురాలు అని చెప్పాడు. విశ్వ.. తప్పు చేస్తే ఒప్పుకోకుండా, సమర్థించుకునే ప్రియ అన్‌ఫిట్ అని అభిప్రాయపడ్డాడు. చివరగా వచ్చిన లోబో.. ప్రియ బిగ్‌బాస్ హౌస్‌కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. ఆసక్తికరంగా సాగిన ఈ ప్రక్రియలో లోబోకి నాలుగు, ప్రియకి నాలుగు ఓట్లు పడ్డాయి.
అయితే ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లనున్నారు. ఇద్దరిలో ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తే వారు సేఫ్ అవుతారు, మిగతా వారు ఎలిమినేట్ అవుతారు అని అన్నాడు నాగ్. రవి, సన్నీ, విశ్వ.. ఈ ముగ్గురు మాత్రమే లోబో వైపు నిలబడగా మిగిలిన అందరూ ప్రియకు మద్దతిచ్చారు. దీంతో లోబో ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించడంతో రవి, విశ్వ షాకయ్యాడు. విశ్వ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
అందరికి గుడ్ బై చెబుతూ స్టేజ్‌పైకి వచ్చిన లోబో థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ గేమ్ ఆడాడు. అందరికి థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ వారందరికి క్షమాపణలు చెప్పాడు. తెలిసో తెలియక ఏదైన తప్పు చేస్తే క్షమించండని కోరాడు. ఇక లోబో వెళ్లిపోతున్న సమయంలో మళ్లీ అతనిని పిలిచి నిన్ను ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్షకులకు మాత్రమే ఉందని చెప్పడంతో లోబో నేలపై మోకరిల్లి ఏడ్చాడు. మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాలని ఓటేసినందున వచ్చేవారం నేరుగా నామినేషన్స్‌లో ఉండబోతున్నావని చెప్పాడు. ప్రస్తుతానికి సీక్రెట్ రూంలో ఉంటూ గేమ్‌ని పరిశీలించు అని నాగార్జున అన్నాడు.