తెలంగాణ ఆడపడచులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేటితో ప్రారంభంకానున్నాయి. 8రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను చాలా గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. ముందుగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది.
ఈరోజు నుంచి అక్టోబర్ 6 వరకూ బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకోనున్నారు. తెలంగాణతోపాటూ… ముంబై, బెంగళూరు, కర్నాటకలోనూ బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కావాల్సిన సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి రోజున అంటే అక్టోబర్ 6న ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్వరకు ర్యాలీ ఉండబోతోంది. ముగింపు వేడుకలు ట్యాంక్‌బండ్‌పై జరగనున్నాయి. ఇండియాతోపాటూ… మరో ఆరు దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగబోతున్నాయి.
8 రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు:
1. ఎంగిపూల బతుకమ్మ- ఈ రోజు మహా అమావాస్యను పురస్కరించుకుని మొదటి బతుకమ్మను తయారుచేస్తారు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని అంటారు. నువ్వులు, బియ్యపుపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2. అటుకుల బతుకమ్మ- 29.09.19: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండువ రోజు బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు.
3. ముద్ధపప్పు బతుకమ్మ- 30.09.19: ఇక మూడవ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
4. నానబియ్యం బతుకమ్మ- 01.10.19: నాలుగోరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
5. అట్ల బతుకమ్మ- 02.10.19: ఇక ఐదవ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
6. అలిగిన బతుకమ్మ- 03.10.19: ఆరో రోజు ఆశ్వయుజ పంచమి వస్తుంది. నైవేద్యం ఏమీ సమర్పించరు.
7. వెన్న ముద్దల బతుకమ్మ- 04.10.19: ఇక ఏడవ రోజు నువ్వులు, వెన్న కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
8. సద్దుల బతుకమ్మ- 05.10.19: ఎనిమిదవ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. మొత్తం ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం ప్రత్యేకంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.