తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆఖరుకు పండుగలపై కూడా వికృత రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు తెలంగాణ అస్థిత్వానికి, సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పాటలను రాజకీయ పాటలుగా మార్చేసి సీఎం కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ బండి సంజయ్ ఆదేశాల మేరకు బీజేపీ ఐటీ సెల్ రంగంలోకి దిగింది. ఇంతలో బతుకమ్మ పండుగ రావడంతో బీజేపీ అధికార ప్రతినిధి, ఐటీ సెల్ కార్యదర్శి రాకేష్ రెడ్డి తన పైత్యాన్ని ప్రదర్శించాడు.
బతుకమ్మ పాటల పేరడీలో రాజకీయ విమర్శలతో కూడిన పాటలు రాయించి పాడించాడు. ఆ పాటలను గతంలో మహిళలు ఆడిన బతుకమ్మల వీడియోలకు ఎడిటింగ్‌లో సింక్ చేయించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయించాడు. సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్నట్లు బీజేపీ బత్తాయిలు బ్యాడ్ క్యాంపెయిన్ మొదలెట్టారు. ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ శ్రావ్యంగా వినిపించే సంప్రదాయ పాటల స్థానంలో ఫాంహౌస్ పాలన అంటూ బతుకమ్మ ఆడుతున్న వీడియోలు ప్రత్యక్షమవడంతో ప్రజలు ఖంగుతింటున్నరు..ఛీఛీ..పవిత్రమైన బతుకమ్మ పండుగలను తమ రాజకీయ లబ్ది కోసం ఇలా ఖూనీ చేస్తారా అంటూ కాషాయ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
బరాబర్ మాది హిందువుల పార్టీ అని చెప్పుకునే బండి సంజయ్ హిందువులు జరుపుకునే బతుకమ్మ పండుగ పాటలను ఇలా వక్రీకరించడంపై సొంత పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నరు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గం, వీణవంక మండలం, బొంతుపల్లికి చెందిన సంపత్‌కుమార్ అనే బీజేపీ కార్యకర్త బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డికి ఫోన్ చేసి బతుకమ్మ పాటలపై పార్టీ చేస్తున్న గలీజ్ రాజకీయంపై మండిపడ్డాడు. బతుకమ్మ పాటలను అలా ఎడిటింగ్ చేసి గబ్బుగబ్బు ఎందుకు చేస్తున్నరు అని రాకేష్ రెడ్డిని నిలదీశాడు. బతుకమ్మ పాటలపై అలా రాజకీయ పాటలుగా మార్చి ప్రచారం చేస్తే మహిళల్లో పార్టీపై వ్యతిరేకత వస్తుందని సంపత్ తమ రాష్ట్ర నేతకు హితవు పలికాడు. నేను మీకు చెప్పే స్థాయి కాదంటూనే…చెట్టుకు, పుట్టకు ప్రతి దానికి పూజించే సంస్కృతి మనది..అలాంటి బతుకమ్మ పాటలను రాజకీయానికి వాడుకుంటే మనకే నెగెటివ్ అవుతుందని సంపత్ రాకేష్ రెడ్డికి క్లాస్ తీసుకున్నడు.. మనోళ్లు ఇట్ల ఎందుకు చేస్తున్నరని నా భార్యనే తిట్టిందని ఆ బీజేపీ కార్యకర్త చెప్పుకొచ్చాడు. ఈ బతుకమ్మ పాటలను నిజాంకు వ్యతిరేకంగా పాడుకున్నవి అంటూ రాకేష్ రెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేయగా…అన్నా నేనూ చదువుకున్నా అన్నా…నిజాంకు వ్యతిరేకంగా పాడుకున్నా..ఇప్పుడు బతుకమ్మ పాటలను కేసీఆర్‌కు వ్యతిరేకంగా పాడుకోవడం కరెక్ట్ కాదన్నా..మీరేమన్నా అనుకోండి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డికి బీజేపీ కార్యకర్త కర్రు కాల్చి వాతపెట్టాడు. మొత్తంగా బతుకమ్మ పాటలను రాజకీయ పాటలుగా మార్చిన బండి సంజయ్‌ను బీజేపీ కార్యకర్తలే ఛీకొట్టడం ఆ పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.