హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూకుడుతో వెనుకబడిపోయిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఇప్పుడు నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదురైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే ఓడిపోతాననే భయంతో ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయిన ఈటలకు కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం పెద్ద దెబ్బే వేసింది. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను మళ్లీ పెంచడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత దసరా నుంచి ఈ దసరా వరకు వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 300 లు పెరగడం సామాన్యుడిని మరింత మంట పెట్టిస్తోంది. అంటే దాదాపుగా రోజుకో రూపాయి పెరిగిందన్న మాట…
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దసరా కానుకగా మోదీ సర్కార్ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంతో బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రచారం నిమిత్తం ఇంటింటికీ వెళుతున్న ఈటల వర్గాన్ని, బీజేపీ నేతలు, కార్యకర్తలపై మహిళలు విరుచుకుపడుతున్నారు. గ్యాస్ ధరలు ఇట్లా పెంచుకుంటూ పోతే బతికేదెలా అంటూ ఈటల వర్గీయులను కడిగిపారేస్తున్నారు.తాజాగా బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమైన సందర్భగా హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు షాకింగ్ పరిణామం ఎదురైంది. బతుకమ్మలతో పాటు గ్యాస్ సిలిండర్లు కూడా పెట్టి బతుకమ్మ ఆడి మహిళలు వినూత్న నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడ శివాలయం వద్ద మహిళలు గ్యాస్ సిలిండర్ల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడారు.

సిలిండర్ ధరను వెయ్యికి పెంచిన బీజేపీ వలలో..పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన బీజేపీ వలలో..అంటూ పాటలు పాడుతూ బీజేపీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన బీజేపీపై మహిళలు మండిపడుతున్నారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించి బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. బతుకమ్మ పండగలో బీజేపీపై ఆడబిడ్డలు ప్రదర్శించిన వినూత్న నిరసన ఈటల వర్గానికి షాకింగ్‌గా మారింది. ఓట్ల కోసం అడిగేందుకు వెళితే మహిళలతో ఎక్కడ చివాట్లు తినాల్సి వస్తుందోనని ఈటల వర్గీయులు వణికిపోతున్నారు..మొత్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పనితో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పూర్తిగా ఇరకాటంలో పడిపోయారు. గ్యాస్ ధరల పెంపుతో బీజేపీకి మహిళలు ఓట్లేసే ప్రసక్తే లేదని, ఈటల ఓడిపోవడం ఖాయమని హుజురాబాద్‌లో ప్రచారం జరుగుతోంది.

