దీపు చంద్ర హత్యను ఖండించిన బంగ్లా!

7
- Advertisement -

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లాలో హింసాత్మక ఘటనల మధ్య, దైవదూషణ ఆరోపణలపై గుంపు దాడిలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ హత్యకు గురైన ఘటనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆగ్రహంతో కూడిన గుంపు అతడిపై దాడి చేసి, అనంతరం అతడి మృతదేహాన్ని నిప్పంటించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్పందించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విద్యా సలహాదారు సీఆర్ అబ్రార్ మంగళవారం బాధిత కుటుంబాన్ని కలుసుకుని, ప్రభుత్వ తరఫున సంతాపం తెలిపారు. దీపు తండ్రి రబీలాల్ దాస్ను కలిసిన అబ్రార్, ఈ హత్యను “షాకింగ్ మరియు సమర్థించలేని నేరం”గా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలకు బంగ్లాదేశ్ సమాజంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.

ఆరోపణలు, వదంతులు లేదా మత విశ్వాస భేదాలు హింసకు కారణం కావని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అబ్రార్ స్పష్టం చేశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, చట్టపరమైన ప్రక్రియ ద్వారా న్యాయం అందిస్తామని తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.

దీపు చంద్ర దాస్ హత్యపై భారత్‌లో పలు నగరాల్లో తీవ్ర ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట వీహెచ్‌పీ కార్యకర్తలు నిరసనలు చేపట్టి, బారికేడ్లను దాటే ప్రయత్నం చేశారు. కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, మధ్యప్రదేశ్, అగర్తలా తదితర ప్రాంతాల్లోనూ హిందూ సంఘాలు నిరసనలు నిర్వహించి, పొరుగుదేశంలో మైనారిటీల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

Also Read:ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

ఇదిలా ఉండగా, డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో 32 ఏళ్ల యువ నాయకుడు షరీఫ్ ఒస్మాన్ బిన్ హాదిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తలకు తూటా తగలడంతో తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స కోసం సింగపూర్ తరలించగా, ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం బంగ్లాదేశ్‌లో పలు నగరాల్లో హింస, విధ్వంసం చోటుచేసుకుంది.

 

- Advertisement -