కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అంశం మళ్లీ జోరందుకుంది. రాహుల్ గాంధీ నాయకత్వం విఫలమైందన్న విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీకి అప్పగించాలన్న డిమాండ్ కాంగ్రెస్ వర్గాల్లో బలపడుతోంది. ఇప్పటికే పార్టీ అంతర్గతంగా రాహుల్–ప్రియాంక వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం అనేకమందిని ఆకట్టుకుంది. ఆమె ఆత్మవిశ్వాసం, దూకుడు, అంశాలపై పట్టు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కీలక రాజకీయ సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం, పార్టీ సీనియర్ నేతలకు కూడా చాలాసార్లు అందుబాటులో లేకపోవడం అసంతృప్తికి కారణమవుతోంది. అంతేకాదు, ఆయన ప్రచారం చేసిన చాలా చోట్ల కాంగ్రెస్ పరాజయం పాలవడంతో నాయకత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ఎన్‌డీటీవీ వెబ్‌సైట్‌లో రాసిన కథనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ పార్టీకి తగినంత సమయం కేటాయించడం లేదని, దీనివల్ల సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉందని, ప్రియాంక గాంధీని ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో వారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, ప్రియాంక గాంధీకి ప్రధాన మంత్రి బాధ్యతలు అప్పగిస్తే, ఇందిరా గాంధీ తరహాలో శక్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తారని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఆమె “పెద్ద పదవికి అన్ని విధాలా అర్హురాలు” అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనే కాక దేశ రాజకీయాల్లోనూ కలకలం రేపుతున్నాయి.
Also Read:ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

