‘మా’ ఎన్నికలు.. ప్రకాష్ రాజ్‌కు షాకిచ్చిన బండ్ల..

30

తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సంచలనంగా మారాయి. మా అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్‌ రాజ్‌,హీరో మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు అక్టోబర్‌ 10న జరగనున్న నేపథ్యంలో ఈ నెల 2న ప్రకాశ్‌రాజ్‌ తన ‘సినిమా బిడ్డల’ ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే తన ప్యానల్‌లో ఉన్న వాళ్లందరితో మీడియా సమావేశం నిర్వహిస్తామని, అప్పుడే ‘మా’ ఎన్నికల కోసం అజెండా, ప్రణాళికను వివరంగా ప్రకటిస్తామని చెప్పారు. అప్పటిదాకా మీడియాతో తమ ప్యానల్‌ తరపున ప్రతినిధులుగా జయసుధ, బండ్ల గణేష్‌, సాయికుమార్‌ మాత్రమే మాట్లాడతారని ప్రకాష్ రాజ్ ప్రకటించారు.

అయితే తాజాగా ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ షాకిచ్చారు. ప్రకాష్ రాజ్ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించలేనంటూ చేతులెత్తేశారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘‘గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గారు, నన్ను అధికార ప్రతినిధిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అయితే నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవిని నేను నిర్వర్తించలేను. దానికి న్యాయం చేయలేను. దయచేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంచుకోగలరు. మీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. మీ బండ్ల గణేష్’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

అయితే ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్‌లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు. కనీసం ఈసీ మెంబర్స్ లిస్ట్‌లో కూడా బండ్ల గణేష్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే అధికార ప్రతినిధిగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.