బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈ రోజు ఎంతో వైభవంగా జరిగింది.ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, విస్తారంగా వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ బల్కంపేట ఎల్లమ్మను పూజిస్తూ… ఆషాఢమాసంలో మొదటి మంగళవారం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలను ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం 9న అంగరంగ వైభవంగా జరుగనుంది. 10న రథోత్సవం ఉంటుంది.
ఈ కల్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు ఎల్లమ్మ కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. ఎల్లమ్మ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు రెండు లక్షల మందికి పైగా భక్తుల తరలివచ్చారు.
ఇక ఈ దేవస్థానానికి 700 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆలయం కొలువైన ప్రాంతం ఒకప్పుడు పంటలు పండే భూమి. అప్పట్లో ఓ రైతు పొలంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా పది అడుగుల లోతులో ఓ రాతి విగ్రహం బయటపడింది. ఆ భూమి యజమానికి కలలో అమ్మవారు కనిపించి బల్కంపేట ప్రాంతంలో నేను వెలిశాను… గుడి కట్టి పూజించాలని చెప్పిందని ప్రతీతి. అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ బావి నుంచి ఏ కాలంలోనైనా జలం ఊరుతూనే ఉంటుంది.