సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరాదేవి బ్యాగులో రూ.10లక్షలు బయటపడటం కలకలం రేపింది. తిరుమల సందర్శనకు ఆమె హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగారు. బాలయ్య సతీమణి వసుంధరతోపాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరి వద్ద పెద్దమొత్తంలో పాత కరెన్సీ ఉందన్న సమాచారం మేరకు ఇన్‌కంటాక్స్ అధికారి శ్రీనివాస రెడ్డి హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆయన వెంట అరుగురు అధికారుల బృందం కూడా ఉంది. ‘‘మీ వద్ద పెద్ద మొత్తంలో పాత కరెన్సీ ఉందంటూ మాకు పక్కా సమాచారం ఉంది. తనిఖీ చేయాలి’’ అంటూ బాలయ్య ఫ్యామిలీని అధికారులు అడ్డుకున్నారు.
తనిఖీకి బాలయ్య కుటుంబీకులు సహకరించారు. అనంతరం వారి లగేజీని చెక్ చేయగా.. రూ.10లక్షల పాత కరెన్సీ నోట్లు లభ్యమమయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ ఎక్కడిది? ఎందుకు తరలిస్తున్నారు? అంటూ అధికారులు వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే బాలయ్య సతీమణి, బంధువులు ఆ నగదు గురించి వివరణ ఇచ్చారు. తాము శ్రీవారి హుండీలో కానుకగా వేసేందుకే ఈ నగదును తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆధార్ తదితర గుర్తింపు కార్డులను అధికారులకు చూపించారు. వీరి వాంగ్మూలాన్ని ఐటీ అధికారులు రికార్డు చేసి వదిలిపెట్టారు. అనంతరం వారు ప్రత్యేక వాహనంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు.