కేంద్రమంత్రి కూతురు పెళ్లికి డబ్బులు ఎక్కడివి….

160

నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలకు అష్టకష్టాలు మొదలైయ్యాయి. చేతిలో డబ్బులు లేకపోవటం..బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. అనేక పరిమితులతో పాటు.. బ్యాంకుల వద్దా కరెన్సీ కొరత తీవ్రంగా ఉండటంతో నోట్ల కోసం పాట్లు రోజురోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఏటీఏంలు ఉన్నప్పటికీ ఎనీటైం నో మనీగానే దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఏదైనా శుభకార్యం చేయాలంటే ఆకాశంలో నక్షత్రాలు పగలే కనిపించే పరిస్థితి ఏర్పడింది. అన్నింటికి మించి ప్రస్తుతం పెళ్లిళ్ల లాంటి వేడుకలు చేపట్టాల్సి వస్తే.. చేతిలో క్యాష్ లేక కిందామీదా పడాల్సి వస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులు సదుపాయం ఉన్నప్పటికీ.. పలు సేవలకు నగుదు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో .. డబ్బున్న లాంటి వారు సైతం.. నగదు కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది.

VVIps for Gadkari daughters wedding
ఇలాంటి కష్టాల్లో .. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన కుమార్తె వివాహాన్ని ఈ రోజు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. సామాన్యుడి పెళ్లి కోసం నగదు కోసం పడుతున్న పాట్లు.. కేంద్రమంత్రికి కూడా తాకాయా? లేక.. ఆయనకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదా? అన్నది ఇప్పుడు సామాన్యుడికి ప్రశ్నగా మారింది. పలువురు కేంద్రమంత్రులు.. వీవీఐపీలు.. సెలబ్రిటీలు వస్తున్న ఈ వివాహ వేడుకలకోసం అయ్యే ఖర్చు.. దానికి కేంద్రమంత్రి చెల్లింపుల లెక్కను దేశ ప్రజలకు వివరంగా చెబితే.. ఆయన మేనేజ్ మెంట్ థియరీ పలువురికి సాయం చేస్తుందన్న మాట నెటిజన్లలో వినిపిస్తోంది. మరి.. ఆ పెళ్లి తర్వాత పెళ్లి లెక్కను గడ్కరీ చెబుతారా? లేదో వేచిచూడాలి మరి.