భోగి సంబరాల్లో బాలయ్య సందడి..

30

నందమూరి నట సింహం బాలకృష్ణ తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. సోదరి పురందేశ్వరితో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ప్రకాశం జిల్లా కారంచేడు చేరుకున్నారు. ఈరోజు నిర్వహించిన బోగి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంబరాలల్లో దగ్గుబాటి దంపతులు,పురందరేశ్వరి,వెంకటేశ్వరరావు ,లోకేశ్వరి,ఉమామహేశ్వరి, బాలక్రిష్ణ దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. సంపద పెంచే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ ఇదని, అందరిలోనూ ఆనందం నింపే పండుగ సంక్రాంతి అని అన్నారు. క్రాంతి అంటే మార్పు అని, సంక్రాంతి అంటే మంచి మార్పు అని వివరించారు. ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకోవడం, రంగవల్లులతో సంక్రాంతిని ఆహ్వానించడం, పెద్దలను స్మరించుకోవడం, పశువులను పూజించడం వంటివి అనాదిగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. ప్రజల అభివృద్ధికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలని, ఇంటింటా సంతోషాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్టు బాలకృష్ణ ఆకాంక్షించారు.