దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ఆయన కుమారుడు ఇస్మాయిల్ చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈద్గాలు, మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మసీదులు, ఈద్గాలు ముస్లిం సోదరులతో కిక్కిరిసి పోయాయి. ఇబ్రహీం స్ఫూర్తితో దైవమార్గంలో ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తామంటూ ముస్లింలంతా బక్రీద్ రోజు నమాజ్ పూర్తయిన తర్వాత ఖుర్భానీ ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రికులు బక్రీద్ రోజు మక్కాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బక్రీద్ పండుగను పవిత్ర దినంగా భావిస్తారు.
ఇక సిటీలోని మసీదులు బక్రీదు కోసం ముస్తాబు అయ్యాయి. బక్రీద్ నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.