బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న బయోపిక్ `బగ్గిడి గోపాల్`. రైటు రైటు టు అధ్యక్షా అనేది క్యాప్షన్. మహేష్, భవ్యశ్రీ, శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా అర్జున్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు ఫిలించాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, టిఎప్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే , నటుడు, నిర్మాత బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ…“ఒక సామాన్య ఆర్టీసీ కండక్టర్ అయిన నేను శాసన సభ్యుడుగా ఎలా ఎదిగాను అనేది ఒకటో పార్ట్ గా చిత్రీకరిస్తున్నాం. ఆకలి తెలిసిన వాడు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎలా సేవ చేస్తాడు, శాసస సభలో ఎదుర్కొన్న సవాళ్లు, కొంత మంది వల్ల నా ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నది రెండో పార్ట్ లో చూపిస్తున్నాం. ఇలా నా జీవితం విద్యార్ది దశ నుంచి ఇప్పటి వరకు అనేక మలుపులతో సాగింది. ఇవన్నీ ఈ చిత్రంలో పొందు పరిచాము. నా లైఫ్ హిస్టరీని సినిమాగా చేయడం మా దర్శకుడు దాన్ని అద్భుతంగా తయారు చేయడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వచ్చి మా యూనిట్‌ను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
టిఎఫ్ సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“బగ్గిడి గోపాల్ గారి లైఫ్ హిస్టరీని సినిమా తీయడం గొప్ప విషయం. కథ విన్నాను. దర్శకుడు చాలా అద్భుతంగా సహజసిద్దంగా తయారు చేశాడు. ఇటీవల కాలంలో బయోపిక్ చిత్రాలు పెద్ద సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడం ఖాయం. రెండు పార్ట్ లుగా రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలన్నారు.
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ…“ బగ్గిడి గోపాల్ లైఫ్ హిస్టరీతో వస్తోన్న ఈ చిత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నా. బగ్గిడి గోపాల్ తొలి ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నా. బగ్గిడి గోపాల్ శాసన సభ్యులుగా ఉన్నప్పుడు నేను కూడా శాసన సభ సభ్యుడిగా ఉండేవాణ్ని. తరుచుగా కలిసేవాళ్లం. ఆయన్ను దీవిస్తూ ఇలాంటి మరెన్నో చిత్రాలు చేయాలన్నారు.
దర్శకుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ..“నేను ప్రస్తుతం వేరే చిత్రం చేస్తున్నా. అందులో బగ్గిడి గోపాల్ విలన్ రోల్‌లో నటిస్తున్నారు. నా వర్క్ నచ్చి బగ్గిడి గోపాల్ బయోపిక్‌ని సినిమాగా చేసే అవకాశం కల్పించిన బగ్గిడి గోపాల్‌కి ధన్యవాదాలు“ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్త పరిచారు.
బగ్గిడి గోపాల్, రెడ్డప్ప రెడ్డి (ఆర్ ఆర్), మహేష్, భవ్యశ్రీ, శ్వేతారెడ్డి, కవిత, సుమన్, రామకృష్ణ గౌడ్, ఎల్ బి శ్రీరాం, జబర్దస్త్ అండ్ గబ్బర్ సింగ్ రౌడీస్ నటిస్తున్న ఈ చిత్రానికి మేనేజర్ః రెడ్డప్ప రెడ్డి, కో-డైరక్టర్ః సివి మురళి; అసోసియేట్ః అన్వేష్ పూరి, కెమెరాః ఎ.ప్రవీణ్ కుమార్; సంగీతం: జయసూర్య; ఆర్ట్ః మనోజ్ కుమార్; నిర్మాతః బగ్గిడి గోపాల్; దర్శకత్వం: అర్జున్ కుమార్.